తెలంగాణాలో రాజకీయం వేడి వేడిగా సాగుతుంది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే దళిత బంధు dalitha bandhu అంటూ చేసిన ప్రకటన సంచలనాలను సృష్టిస్తుంది. ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి అంటూ ఆ వాదనను ప్రతి పక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎమ్మెల్యేగారు రాజీనామా చెయ్యండి మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటాం అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ నెటిజన్స్. ఒక అడుగు ముందుకేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను రాజీనామా చేస్తా.. నిధులిస్తావా అంటూ సవాల్ విసిరారు.
మా నియోజక వర్గానికి దళిత బంధు అమలు చేస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానంటూ కేసీఆర్‌కి ఓపెన్ ఆఫర్ అంటూ ప్రకటించారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి . రాజీనామా లెటర్‌ను తన జేబులో పెట్టుకొని తిరుగుతన్నానని, మీరు రెడీ అంటే రాజీనామా చేస్తా.. హుజూరాబద్ ఉప ఎన్నికలతోపాటు మునుగోడుకు కూడా ఉప ఎన్నికలు పెట్టండి అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని రాజగోపాల్ రెడ్డి కోరారు.
ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉప ఎన్నిక, రాజీనామా అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందరికంటే ఒక అడుగు ముందుకేసి రాజీనామాకు సిద్ధం అని ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. ఈ రోజు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి మరిన్ని రాజీనామాల ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. తమ నియోజక వర్గానికి ఎలాగూ నిధులు కేటాయించడలేదు, ఉప ఎన్నిక వస్తేనే తమ నియోజక వర్గానికి నిధులు వేల కోట్లతో పథకాలు వస్తాయని చెబుతూ కేసీఆర్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
దళితులకు మూడెకరాల భూమి, అంబేద్కర్ విగ్రహం, దళిత ముఖ్యమంత్రి వంటివన్నీ ఎన్నికల స్టంట్లుగానే మిగిలిపోయాయని, దళిత బంధు కూడా అంతేనంటూ ఎద్దేవా చేస్తున్నారు.