ఈటల రాజేందర్ ని టార్గెట్ చేసిన ఆ ఇద్దరు…నెగిటివ్ అవుతుందా?

-

ఈటల రాజేందర్….తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన పేరు. మొన్నటివరకు కేసీఆర్ కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్…అనూహ్య పరిణామాల మధ్యలో టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారు. ఆయనపైన భూ కబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్ విచారణకు ఆదేశించడం, అలాగే మంత్రి పదవిని తొలగించడంతో ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈటల రాజేందర్

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు నెలల లోపు హుజూరాబాద్‌కు ఎన్నిక జరగనుంది. ఇక ఆ ఎన్నికలో  ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని అధికార టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తుంది.

ఇప్పటినుంచే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ని ఓడించే బాధ్యతని తీసుకున్నారు. అటు ఈటల సైతం, హుజూరాబాద్‌లో మళ్ళీ గెలిచి, కేసీఆర్ అధికార గర్వాన్ని అణుస్తానని చెబుతున్నారు. అయితే ఇలా అధికార టీఆర్ఎస్, ఈటల రాజేందర్ మధ్య వార్ నడుస్తుంటే, మధ్యలో కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో కౌశిక్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి, ఈటల రాజేందర్ మీద ఓడిపోయారు. ఇక ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక, కౌశిక్ ఆయన లక్ష్యంగా విమర్శలు చేయడం ఎక్కువ చేశారు. అసలు ప్రతిపక్షంలో ఉన్న కౌశిక్, అధికార పార్టీని పట్టించుకోకుండా ఈటల రాజేందర్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు. అయితే కౌశిక్ గులాబీ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇక కౌశిక్ అలా చేస్తుంటే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ఈటలనే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. గతంలో పెద్దిరెడ్డి హుజూరాబాద్ నుంచి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచారు. అయితే మొన్నటివరకు టీడీపీలో కీలక నాయకుడుగా పనిచేసిన పెద్దిరెడ్డి, బీజేపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ బీజేపీలో రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బీజేపీ పెద్దలు సర్ది చెప్పడంతో పెద్దిరెడ్డి కాస్త సైలెంట్ అయ్యారు. ఈటల బీజేపీలో రావడాన్ని స్వాగతించిన పెద్దిరెడ్డి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్‌లో పోటీ చేస్తానని ఇప్పుడు కొత్త మెలిక పెట్టారు. ఇలా ఈటలకు వ్యతిరేకంగా ఉన్న పెద్దిరెడ్డి సైతం గులాబీ బాస్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికైతే ఈ ఇద్దరు నాయకులు ఈటలని దెబ్బతీయడానికే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version