కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో.. చాలా మంది తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడమో లేక సెలవుపై పంపడమో చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత భారీగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఐటీ ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
అయితే ఇందులో చాలా మందికి లాక్ డౌన్ అయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే సీఐఐ మాజీ అధ్యక్షుడు, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పది లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు.
“ఈ లాక్ డౌన్ కాలంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పనిచేయగలిగేలా చేశాయి. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు చెందిన 90 నుంచి 95 శాతం మంది ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ చాలా వేగంగా, చాలా సులువుగా జరిగింది. అయితే భవిష్యత్తులో ఇదే వ్యాపార కొనసాగింపులలో భాగమయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అయితే అది అంతా సులువైన పని కాదు. ఇంటి వద్ద నుంచి విధులు నిర్వర్తించేవారికి సాంకేతికపరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. క్లయింట్స్ అనుమతితో బిజినెస్ ప్రాసెస్‌లో మార్పు చేయాల్సి వస్తుంది” అని గోపాలకృష్ణన్ తెలిపారు.