తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలతోపాటు జల విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్, వరదజలాల అంశాలపై చర్చకు కేఆర్ఎంబీ కమిటీలు ఈ నెల 23న సమావేశం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు బోర్డు సమాచారమిచ్చింది. 2022-23 నీటి సంవత్సరంలో సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది.
కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శితోపాటు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. జల విద్యుదుత్పత్తి, ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ తోపాటు వరద నీటివినియోగం, సంబంధిత అంశాలపై చర్చకు కేఆర్ఎంబీ, జలాశయాల పర్యవేక్షక కమిటీ అదే రోజు సమావేశం కానుంది. మూడు అంశాలపై సిఫారసులకు సంబంధించి రూపొందించిన నివేదికపై ఆర్ఎంసీ సమావేశంలో చర్చిస్తారు.