ఈనెల 24న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

-

ఈనెల 24వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మరోసారి సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ 17వ భేటీ జరగనుంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే.. రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఏవైనా ఉంటే ఎజెండాలో పొందు పరిచేందుకు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను రాయిపురే కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, ఇతర అంశాల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల చివరి వారంలో సమావేశం కానున్నట్లు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా జలాల సంబంధిత సమస్యలు, అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. 2023-24 నీటి సంవత్సరానికి నీటి కేటాయింపుల అంశంపై కూడా చర్చ జరగనుంది. కృష్ణా జలాల్లో తమకు సగం వాటా కావాల్సిందేనని తెలంగాణ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

పలు అంశాలపై రెండు రాష్ట్రాలు ఇప్పటికే పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఏపీ వాటాను మించి నీటిని ఉపయోగించుకుంటుందని తెలంగాణ ఫిర్యాదు చేయగా… విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ నీటిని దిగువకు వదులుతోందని ఏపీ ఫిర్యాదు చేసింది. వీటితో సహా మరిన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news