మంత్రి కేటీఆర్ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ బరాబర్ వారసత్వ పార్టీనే అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. తమది వారసత్వ పార్టీ అని, కుటుంబ పాలన అని విమర్శిస్తున్న వాళ్లకి తనదైన శైలిలో బదులిచ్చారు కేటీఆర్. ఎన్ని ఎత్తులు, కుట్రలు చేసినా.. జగదీశ్ రెడ్డి విజయాన్ని ఆపలేరు.. ఆయన విజయం పక్కా ఖరారై పోయింది అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో యుద్ధం నేరుగా చేయాలి. చేసింది చెప్పాలి. 55 ఏండ్ల అధికారంలో ఉన్నామని కాంగ్రెస్, పదేండ్లు అధికారంలో ఉన్నామని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. అన్ని ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశారో వారు చెప్పాలి. అదే విధంగా మేం కూడా చెప్పాలని కేటీఆర్ తెలిపారు.
సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది.. పీజీ సీట్లు కూడా వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభమైంది. కలలో ఎవరూ ఊహించని విధంగా సూర్యాపేట జిల్లా అయింది. నల్లగొండ పోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కడుపు నిండా సంక్షేమం, కంటి ముందు అభివృద్ధి ఉంది. కాబట్టి జగదీశ్ రెడ్డిని ఆశీర్వదించి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
దమ్ముంటే నేరుగా కొట్లాడాలి అని కేటీఆర్ అన్నారు. కొందరు శిఖండి రాజకీయాలు, పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. 2000లో కేసీఆర్‌కు ఒక తమ్ముడిలాగా, ఉద్యమానికి ఆకర్షితుడై జగదీశ్ రెడ్డి నడిచారు. పదవులపై ఆకాంక్షతో రాలేదు. కేసీఆర్ మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలడు. రాష్ట్రాన్ని సాధిస్తాడనే నమ్మకంతో ఒక సైనికుడిలాగా 24 ఏండ్ల కిందట కేసీఆర్‌తో కలిసి నడిచిండు. ఇవాళ కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న ఒకాయన అంటాడు. సూర్యాపేటలో డిపాజిట్ రాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. దమ్ముంటే రా తేల్చుకుందాం. ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం అని కేటీఆర్ సవాల్ విసిరారు.