భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా.. రాజకీయాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇతర దేశాలలాగే మన దేశంలో అర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరతామని చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎన్‌హెచ్‌ఆర్డీ జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ‘డీకోడ్ ద ఫ్యూచర్’ అంశంపై జాతీయ సదస్సులో ప్రసంగించారు.
‘చైనా మానవ వనరులను సమృద్ధిగా ఉపయోగించుకుంటోంది. జపాన్‌కు సంబంధించిన వ్యవస్థలపై పెట్టుబడులు సరిగా పెడుతోంది. ‘‘భారత్‌లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారు. అయితే, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దృష్టి అంతా ఎన్నికలపైనే ఉంటుంది. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదే. ఇతర దేశాల మాదిరిగా భారత్‌లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే నంబర్ వన్‌గా ఎదుగుతాం’’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.