గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలు పార్టీల నాయకులు మంత్రులుగా పనిచేసినా కనీసం నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి కష్టాలు కూడా తీర్చలేకపోయారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సాగునీటి, జానారెడ్డి తాగునీటి మంత్రిగా పని చేశారని.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రులుగా పని చేశారని కానీ ఎవరూ ఏం చేయలేక పోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీతో, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మునుగోడులో చాలా వరకు సాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయని.. ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగగలుగుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో మునుగోడును కోనసీమగా తయారు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
“పక్కన కృష్ణా నది పారుతున్న సాగు, తాగునీరు ఇవ్వలేదు. ఫ్లోరోసిస్ తో బాధ పడినా పట్టించుకోలేదు. నక్కలగండి, డిండి ప్రాజెక్టు కావాలనే డిమాండ్ ఉంది. కానీ ముందుకు పోలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక మునుగోడులో రెండు రిజర్వాయర్లకు బీజం పడింది. శివన్నగూడెం – చర్లగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. 70 శాతం పనులు పూర్తయ్యాయి. రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. మునుగోడును కోనసీమగా తయారు చేస్తాం”. అని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ తెలిపారు.