మంచు మనోజ్ సాంగ్‌పై కేటీఆర్ ప్రశంసలు..

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా‌పై అవగాహన కల్పించేలా హీరో మంచు మనోజ్ పాడిన పాటపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మనోజ్ పాడిన ఈ పాట గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చేలా ఉందన్నారు. “ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని, గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం. మనోజ్ పాడిన ఈ పాట మన హృదయాల్లో నమ్మకం, పాజిటివిటి నింపుతాయి” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మనోజ్  కేటీఆర్‌కు థ్యాంక్యూ చెప్పారు. ఇది చాలా మంది గుండెల్లో పాజిటివ్ నమ్మకాన్ని నింపుతుందని ఆశిస్తున్నట్టు మనోజ్ తెలిపారు.

 కాగా, అంతా బాగుంటాం రా అని సాగే ఈ పాటలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కేంద్రం, తెలుగు రాష్ట్రాలు తీసుకుంటున్న కరోనా కట్టడి చర్యలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల గొప్పతనాన్ని వివరించారు.

మంచు మనోజ్ పాడిన పాటకు అచ్చు రాజమణి సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. ఈ పాట కోసం మనోజ్‌తో పాటుగా ఆయన సోదరి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ కూడా గొంతు కలిపారు. ఈ పాటలో మనోజ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో చాలా చక్కగా ప్రజలకు సందేశం ఇవ్వగా.. నిర్వాణ తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో హైలెట్‌గా నిలిచారు. చివర్లో ఓ చక్కని సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. కరోనాపై పోరాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ పాటను అంకితం చేశారు.

కాగా, సినిమాల విషయానికి వస్తే మూడేళ్ల తర్వాత మనోజ్ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మనోజ్ కమ్‌బ్యాక్‌ సినిమాగా ‘అహం బ్రహ్మస్మి’ అనే ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మంచు మనోజ్, నిర్మలా దేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు లాక్ డౌన్‌కు కొద్ది రోజుల కిందట జరిగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news