డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో ఆయన విగ్రహాన్ని మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆవిష్కరించారు.
‘అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు సాగుతున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నేత. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం ఆయనకే సాధ్యం. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం సాహసోపేతమైనది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరే పెట్టాలి. దేశంలోనే అతిపెద్దదైన ఆయన విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం. శతాబ్దాలపాటు దిశానిర్దేశం చేసేలా దాన్ని ఏర్పాటు చేశాం. స్థానికుల డిమాండ్ మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్ పేరు పెడతాం’’’ అని కేటీఆర్ ప్రకటించారు.