రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు డొరండా ట్రెజరీ కేసులో శుక్రవారం బెయిల్ మంజూరు అయింది.దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లభించింది.ఆయన ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనకు సీబీఐ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.లాలు తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, లాలూ ప్రసాద్ యాదవ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అన్నారు.
సగం శిక్షాకాలం జైలులోనే గడపడం, ఆరోగ్య సమస్యలు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ ఉపశమనం ఇచ్చిందన్నారు.రూ.లక్ష విలువైన పూచీకత్తు సమర్పించాలని, రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించినట్లు తెలిపారు.లాలూకు రాంచీలోని స్పెషల్ సిబిఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష రూ. 60 లక్షలు జరిమానా విధించింది.ఈ కుంభకోణం జరిగిన సమయంలో లాలూ బీహార్ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బాధ్యతలను నిర్వహించారు.