ఇప్పటికే టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తున్నారంటూ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎంతోమంది టీవీలు, మీడియా ముందుకు వచ్చి మరీ ఆధారాలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన తర్వాత దేవరయంజాల్ భూముల విషయంలో టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఆరోపణలు చేశాయి.
అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యేపై భూ వివాదంలో కేసు నమోదైంది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కాప్రా తహసీల్దార్‌పై జవహర్‌నగర్‌లో కేసు నమోదైంది. తన భూమిని కావాలాని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని జూలకంటి నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 152లో గల తనభూమిని కావాలనే ఎమ్మెల్యే, అతని అనుచరులు పెన్సింగ్‌ను తొలగించారని, ఇందుకు తహసీల్దార్ సపోర్టు చేశారని ఆరోపించాడు. తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. టీఆర్ ఎస్ నేతలంతా భూ కబ్జాకోరులని ఆరోపిస్తున్నాయి. వెంటనే ఆ భూమిపై కూడా విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.