టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి.. క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. వాలంటీర్లు ఒక్కటే కాదు ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడంలో ఆయన దిట్ట అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా దత్తపుత్రుడితో కలిసి తప్పుడు ప్రచారం చేశారు.. పెన్షన్లు అడ్డుకోవడంతో ప్రజలలో తిరుగుబాటు వచ్చేసరికి భయపడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చారు అని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై దుష్ప్రచారం జరుగుతోంది.. 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ-టీడీపీ జనసేన పార్టీలు ప్రజల ముందు మాయమాటలు చెబుతున్నాయని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు విమర్శలను ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యతను కార్యకర్తలు విస్తృతం చేయాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.