ఏది ఎలా జరిగిన గానీ…ఏపీలో మాత్రం జనసేన కార్యకర్తలకు కొత్త ఊపు వచ్చింది. ఇంతకాలం ఏదో అలా అలా రాజకీయం నడిపించుకుంటూ వచ్చిన జనసైనికులు ఇప్పుడు దూకుడు ప్రదసించడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ సైతం పూర్తి స్థాయిలో రాజకీయం చేయలేదు…ఏదో అప్పుడప్పుడు పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేశారు. దీంతో జనసేన పరిస్తితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. నేతలు, కార్యకర్తలు సైతం కూల్‌గా పాలిటిక్స్ చేస్తూ వచ్చారు.
ఏనాడూ జగన్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేయలేదు. టిడిపి ఎంత హడావిడి చేసిన జనసేన మాత్రం అప్పుడప్పుడు హడావిడి చేస్తూ వచ్చింది. దీని వల్ల జనసేన పార్టీ ఏ మాత్రం ఏపీలో పికప్ కాలేదు. మరి ఈ మధ్య ఏమైందో తెలియదు గానీ, అంటే కొన్ని ఎంపిటిసిలు గెలవడం, పవన్ ఎప్పుడూలేని విధంగా జగన్, మంత్రులని తిట్టడంతో ఒక్కసారిగా రాజకీయం మారింది. పవన్‌ని ఏమో వైసీపీ వాళ్ళు తిట్టడం, ఇటు జనసేన కార్యకర్తలు కూడా రివర్స్‌లో విరుచుకుపడటం చేస్తున్నారు. ఇలా వైసీపీ-జనసేనల మధ్య వార్ నడుస్తోంది.
ఇదే క్రమంలో పవన్ ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ చేసేలా కనిపిస్తున్నారు. అందుకే తాజాగా పార్టీ మీటింగ్ పెట్టి మరీ తాను ఇంకా దూకుడుగా ఉంటానని సిగ్నల్స్ ఇచ్చేశారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలకు కొత్త ఊపు వచ్చేసింది. సరే ఊపు అయితే వచ్చింది గానీ, ఆ ఊపుకు తగ్గట్టుగా రాజకీయం చేస్తారా? లేదా? అనేది మున్ముందు చూడాలి.
అలాగే ఈ ఊపుని ఏదో ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకు పరిమితం చేస్తే పావలా ఉపయోగం ఉండదు. 175 నియోజకవర్గాల్లో జనసైనికులు సత్తా చాటాలి. కానీ అది మాత్రం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జనసేనకు అంత బలం లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో జనసైనికులు ఏ మాత్రం సత్తా చాటుతారో.