రాజకీయాల పరంగా సంచలన నిర్ణయాలు తీసువడంలో సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన తెలంగాణ శాసనసభకు ఇంకా 9 నెలల సమయం ఉన్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేసి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. దీంతోపాటు తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా అదే రోజు ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల వేడి రగులుతోంది.
అయితే సీఎం కేసీఆర్ అలా ముందే అభ్యర్థులను ప్రకటించేయడం టీఆర్‌ఎస్ పార్టీలో కొందరికి నచ్చలేదట. ముఖ్యంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న వారు ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి లోనవుతున్నట్లు తెలిసింది. అందుకే అలాంటి నేతల్లో చాలా మంది ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను విడిచి పెట్టాలని చూస్తున్నారు. పార్టీని వీడి వేరే పార్టీలో చేరాలని కొందరు అనుకుంటుంటే, మరికొందరు ఏ పార్టీలో చేరకుండా రెబల్‌గా మారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి మారనున్న నేతల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు ఉన్నట్లు తెలిసింది. వారంతా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వారితోపాటు మరికొంత మంది ఆశావహులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం కూడా ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. బుధవారం కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలోనే నేతలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది. పార్టీలు మారనున్న నేతల్లో డీఎస్, కొండా దంపతులు, భూపతి రెడ్డి, రమేష్ రాథోడ్, కేఎస్ రత్నం, నందీశ్వర్ గౌడ్, ఆకుల రాజేందర్ తదితరులు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తుల జాబితా మాత్రం ఇప్పడిప్పుడే నెమ్మదిగా బయట పడుతోంది. ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎంత మంది పార్టీలు మారతారో వేచి చూస్తే తెలుస్తుంది.