గెలుపు.. ప్రతీ ఒక్కరికీ కావాల్సిందే. దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. మరెన్నో వదిలేసుకుంటారు. తిండీ తిప్పలూ మానేసి గెలుపు కోసమే శ్రమిస్తుంటారు. అంత చేసినా కూడా అందరికీ గెలుపు దక్కదు. గెలుపు కోసం పోరాడే క్రమంలో ఎన్నో పోగొట్టుకుని చివరికి అది దక్కక నావల్ల కాదని బాధపడుతూ, నేనింతే అని చింతిస్తూ తమని తాము నిందించుకుంటూ బాధపడుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓడిపోయిన తర్వాత గెలుపు కోసం చేసిన పోరాటమంతా వృధా అయ్యిందే, ఆ సమయంలో మిస్సయిన చిన్న చిన్న ఆనందాలని తల్చుకుంటూ బాధపడేవాళ్ళు చాలా మంది.
అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలేంటో చూద్దాం.
చాలామంది చేసే తప్పు ఒకటుంది. విజయం కోసం వీరోచితంగా పోరాడుతూ చిన్న చిన్న ఆనందాలని పట్టించుకోరు. అలాంటి వాళ్లకి ఆనందం అనేది అప్పుడప్పుడు పలకరించే చుట్టంలా అనిపిస్తుంది. విజయం తర్వాత వచ్చేదే అసలైన ఆనందంగా వాళ్ళు ఫీలవుతారు. విజయం కోసం శ్రమించడం వరకూ ఓకే. కానీ విజయంతోనే ఆనందం వస్తుందనుకోవడం కరెక్ట్ కాదు. అలా అనుకున్నవాళ్ళు విజయం దక్కకపోతే ఎంతగానో బాధపడాల్సి ఉంటుంది.
అలా కాకుండా గెలుపు కోసం పోరాడుతూ, ఆ పోరాటంలో ఆనందం పొందుతూ, మధ్యలో వచ్చే అన్ని ఆనందాలని తనదిగా చేసుకుంటూ, సక్సెస్ కోసం శ్రమించేవాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. నిజానికి అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే రేపేం జరుగుతుందో తెలియదు కాబట్టి, విజయం వచ్చేదాకా ఆనందాలని అణచిపెట్టుకుని ఉండడం కరెక్ట్ కాదు. అలా చేస్తుంటే ఒక్కోసారి అలసిపోయినట్లు ఉంటుంది. ఆ అలసటలో గెలుపు తీరానికి చేరడం కష్టమవుతుంది.
ఆనందం అలసటని దరిచేరనివ్వదు. అందుకే చిన్న చిన్న వాటికి ఆనందించడం అలవాటు చేసుకోండి. జీవన ప్రయాణంలో ఆనందం కేవలం అప్పుడప్పుడు మాత్రమే దొరికేది కాకూడదు.