వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాగా, ఆయన సోదరి షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే షర్మిలకు తన అన్న జగన్ మద్దతు లేదని వ్యాఖ్యానాలు వినిపించాయి. ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే, జగన్, షర్మిల తాజాగా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఒకే వేదికపై కనిపించారు.
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల, విజయమ్మ, జగన్ కనిపించారు. జగన్, షర్మిల తమ తండ్రికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అయితే, జగన్, షర్మిల ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే కనిపించారు. వారిరువురు అసలు మాట్లాడుకునే పరిస్థితి లేరని అక్కడ కనిపించిన తీరును బట్టి కొందరు అంచనా వేస్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్కు నివాళి అర్పించేందుకుగాను ఆయన అభిమానులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తరలివచ్చారు. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షర్మిల ఇంత వరకు జగన్ను కలవలేదు.
తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనకుగాను వైఎస్ఆర్టీపీ కృషి చేస్తుందని షర్మిల పేర్కొంటోంది. ఆల్రెడీ ఏపీలో జగనన్న రాజ్యం నడుస్తున్నందున, అక్కడ నుంచి వైసీపీ మద్దతుదారులు తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి మద్దతు తెలుపుతారని వైఎస్ఆర్టీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, కొంత కాలంగా దూరంగా ఉంటున్న అన్నా చెల్లెల్లు జగన్ షర్మిల ఒకే వేదికపై కనిపించడం పట్ల వైఎస్ఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైఎస్ఆర్టీపీకి నేతలు లేరు అనే విమర్శలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆ పార్టీకి మహిళా నేత ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో రాజకీయంగా పార్టీ పట్టు నిలుపుకోవాలంటే బలమైన నేతలు ముఖ్యమనే అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అయితే, షర్మిల పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటోందని వైఎస్ఆర్టీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.