ఇంట్లో ఉన్నంత వరకు ఓకే.. కానీ బయటకు వెళితే మాత్రం మన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ అటవీ ప్రాంతంలో తిరిగేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రదేశాల్లో వన్య ప్రాణులు ఏ క్షణమైనా మన మీద దాడి చేయవచ్చు. కనుక అలాంటి ప్రదేశాల్లో అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు. కానీ ఆ బాలిక మాత్రం అలా ఆలోచించలేదు. ఫలితంగా చిరుతపులి దాడిలో ప్రాణాలను కోల్పోయింది.
నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో 8 తరగతి చదువుతున్న ఓ బాలిక హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటోంది. అయితే అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ చిరుతపులి ఆ బాలికపై దాడి చేసి చంపేసింది. ఆమె హెడ్‌ఫోన్స్‌లో పెద్దగా సౌండ్ పెట్టుకుని పాటలు వింటూ ఉండవచ్చని.. ఆ సమయంలో చిరుతపులి వచ్చిన విషయాన్ని ఆమె గమనించకపోయి ఉండవచ్చని.. అందుకనే ఆమె చిరుత దాడిలో చనిపోయిందని.. అటవీ శాఖ అధికారులు తెలిపారు.
కాగా గతంలోనూ మనం దాదాపుగా ఇలాంటి సంఘటనల గురించే చదివాం. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ రోడ్డు లేదా రైలు ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కనుక ఆయా ప్రదేశాల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం మానేస్తే మంచిది.