ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది! కరోనా పుణ్యమాని పెట్టుకున్న లాక్ డౌన్ నేపథ్యంలో దేశం ఆర్ధికంగా కుదేలయ్యింది! సుమారు 45 రోజులుగా అన్ని వ్యాపారకార్యకలాపాలు ప్రజల జనజీవన కార్యకలాపాలు ఆగిపోయాయి.. దాంతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే అన్ని రంగాలూ మూసి ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఇన్ కమింగ్ లేదు.. పైగా కరోనాతో అదనపు ఖర్చు! రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయం రావడం లేదు. కాకపొతే… తాజాగా కేంద్రం సడలింపులు ఇవ్వడంతో రాష్ట్రాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సమయంలో దేశాన్ని ఆదుకునేది ఎవరు? పెద్దపెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలో, బ్యాంకర్లో, ఆర్థిక నిపుణులో, అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారో అనుకుంటే పొరపాటే… ఈ సమయంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేది మందుబాబులే! అవును… ప్రస్తుతం రాష్ట్రాలు కూడా ఇదే విషయాన్ని నమ్మకనే నమ్ముతున్నాయి!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ తో ఇన్నాళ్లు నష్టపోయిన ఆదాయాన్ని మద్యం ద్వారానే రాబట్టుకోవాలని చూస్తున్నాయి! అందులో భాగమే అత్యధికంగా పెంచేస్తున్న మద్యం ధరలు! ఢిల్లీలో పెంచారు కాబట్టి తాము పెంచుతున్నామని ఏపీ చెబుతున్నా… పక్క రాష్ట్రాలు పెంచాయి కాబట్టి మేము పెంచుతున్నామని ఏపీ పక్క రాష్ట్రాలు చెబుతున్నా… ప్రస్తుతం మద్యం ధరలు పెరగడం వెనక ఉన్న అతిపెద్ద లాజిక్… రాష్ట్రాదాయం పెంచడమే! ఈ విషయంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ 25 శాతం పెంచింది.. ఒక రోజు తర్వాత ఏకంగ 50శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 75 శాతం పెరిగింది. ఆ తెల్లారే తెలంగాణ ప్రభుత్వం 16శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇలా ఆంధ్రప్రదేశ్ 75 శాతం, తెలంగాణ 16 శాతం లతోపాటు పశ్చిమ బెంగాల్ 30 శాతం, ఢిల్లీలో 70 శాతం, కర్ణాటక విదేశీ మద్యంపై 17 శాతం, తాజాగా తమిళనాడు రు. 20 వరకూ, ఉత్తరప్రదేశ్ బాటిల్పై రూ.5 నుంచి 30 వరకు పెంచేశారు. దీంతో రాష్ట్రాల అబ్కారీ ఆదాయాలు మామూలుగా పెరగవు! ఒకపక్క రాష్ట్రాలు ఇలా మరో గత్యంతరం లేక మందుబాబులను నమ్ముకుంటే… కేంద్రం కూడా ఏమీ తక్కువ తినలేదు. రాష్ట్రాల మాదిరిగానే కేంద్రం కూడా ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో పెట్రో ఉత్పత్తులపై వడ్డింపు మొదలుపెట్టింది. వాస్తవంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అతి తక్కువగా ఉన్నా కూడా దేశంలో మాత్రం సుంకాలు పెంచేస్తోంది. ఇదే క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అంశం కూడా కేంద్రం వద్ద పరిగణనలో ఉంది.
ఈ లెక్కన చూసుకుంటే… అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఆదాయాలను పెంచుకునే పనిలో పడ్డాయి! ఈ క్రమంలో మందుబాబు మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా దేవుళ్లే! ఎందుకంటే… ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని కాపాడేది వాళ్లే మరి!!