ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు నేరుగా ఏమీ చెప్పడం లేదు అని తెలుస్తోంది. వైసీపీని నడిపిస్తున్నది ప్రశాంత్ కిశోర్ కాదు జగన్ అని కూడా స్పష్టం అవుతోంది. కానీ ఒకనాటి స్ట్రాటజీని ఆయన అందించిన పద్ధతులను జగన్ పాటించేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారన్నది ఓ వాస్తవం. పార్టీలో చాలా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. పదవులు లేని వారి బాధ ఒక విధంగా ఉంది. పోనీ పదవులు ఇస్తే రాణించలేని స్థితిలో కొందరి బాధ మరో విశంగా ఉంది.ఈ దశలో పేరున్న పార్టీల వైపు వైసీపీ నాయకులంతా చూస్తే జగన్ ఒంటరి వాడు అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక పనిచేయని ఎమ్మెల్యేలను దార్లోకి తెచ్చుకునేందుకు నిన్నటి వేళ టిక్కెట్ల విషయమై ఓ స్పష్టమైన వైఖరిని ప్రకటించారని తెలుస్తోంది.
వాస్తవానికి జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరు చాలా వరకూ బాలేదు అని తేలిపోయింది.ముఖ్యంగా పథకాల అమలు సరళిపైనే జగన్ ఆశలు పెట్టుకుంటే, వాటి అమలు ఎలా ఉన్నా సరే కనీసం పట్టించుకోని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు ఆర్థికంగా పెద్దగా పొందింది ఏమీ లేదు.టీడీపీ కన్నా ఘోరంగా అధినేత నిర్ణయాల కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని అంటున్నారు. మైనింగ్ ప్రాసెస్ పెద్దగా లేకపోవడం తమకొక మైనస్ గానే భావిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.
అదేవిధంగా ఇసుకలో కొన్ని వర్గాల నాయకులే దండిగా డబ్బులు చూస్తున్నారన్న అసంతృప్తి కూడా ఉంది. జిల్లాలలకు మంత్రులు వచ్చినా కూడా పాలనకు సంబంధించి విషయాలు కాకుండా అడ్డదారుల్లో డబ్బులు తీసుకువచ్చే విషయాలపైనే ఫోకస్ పెంచుకుంటూ పోతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ దశలో పీకే అస్త్రాన్ని బయటకు తీశారు జగన్.అంటే పని చేయకపోతే ఇంటికే అని స్పష్టంగా చెప్పేశారు. కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇస్తే ఆ విధంగామరింత మార్పునకు తానే కారణం అయ్యానని రేపటి వేళ జగన్ చెప్పుకునేందుకు వీలుంటుంది కూడా!