తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులలో మద్యం ఒకటి. గత రెండేండ్ల కాలంలో రూ.54వేల కోట్ల అమ్మకాలు జరిగాయంటే ప్రభుత్వానికి ఏ మేరకు రాబడి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది మద్యం అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే. మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చే రాబడి అదనం. ఈసారి కూడా టెండర్ల ప్రక్రియ మొదలైంది. దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. వీటి ద్వారా రూ.1200కోట్ల రాబడి నిర్దేశించుకున్న అధికార యంత్రాంగం అప్లికేషన్ల చివరి తేదీని పొడిగించే అంశంపై దృష్టి సారించింది.
గురువారం ఆఖరు కావడటంతో బుధవారం ఒక్కరోజే 15వేల అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు మద్యం దుకాణాల కోసం 29వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు మరో 30వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అత్యధింగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 మద్యం దుకాణాలకు 4500, రంగారెడ్డి జిల్లాలో 4500 అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్‌లో 1300 దరఖాస్తులు వచ్చాయి.
ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. టెండర్ వచ్చినా రాకపోయినా ఈ డబ్బులను వెనక్కి ఇవ్వరు. కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.1200కోట్లు ఆర్జన లక్ష్యంగా ఎక్సైజ్‌శాఖ పెట్టుకున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువు పెంపుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.