కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిందే. దాదాపుగా అన్ని రంగాలూ తీవ్రమైన నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక కరోనా ప్రభావం వల్ల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని సమాచారం. ఈ క్రమంలో నెల నెలా ఈఎంఐ చెల్లింపులు చేసే వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని, కనుక వారు ఏడాది పాటు ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులు బాటు కల్పించాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ బ్యాంకులను కోరింది.
కరోనా దెబ్బకు జనాలంతా విలవిలాడిపోతుంటే.. చాలా మంది కొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కోల్పోతారని.. కనుక వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలంటే.. రుణాలను తీసుకున్న ఉద్యోగులకు వెసులు బాటు కల్పించాలని, వారు ఏడాది పాటు ఈఎంఐలు చెల్లించాల్సిన పనిలేకుండా మారటోరియం కల్పించాలని అసోచామ్ బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఇదే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట అసోచామ్ ఉంచింది.
అయితే కేవలం వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారికి మాత్రమే మారటోరియం కల్పిస్తారా లేక ఇంటి రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు.. ఇతర రుణాలు తీసుకున్న వారికి కూడా ఆ సౌకర్యం కల్పిస్తారా..? అసలు అలా ఏడాదిపాటు ఆర్థిక సంస్థలకు కస్టమర్లు ఈఎంఐలు చెల్లించకుండా ఉండడం సాధ్యపడుతుందా..? అనే వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తే తెలుస్తుంది..!