గత ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కంచుకోటలో వైసీపీ పాగా వేసింది. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొన్న ఈ తరుణంలో తొలిసారిగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తాడిపత్రిలో హీట్ పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాలు,పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పెద్దారెడ్డి దూకుడుతో దాయాదుల పోరు సీమలో ఆసక్తి రేపుతుంది.
స్థానిక ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు అనంతపురం జిల్లాలో రెండు కీలక వర్గాలు సమాయత్తమవుతున్నాయి. మొన్న తాడిపత్రిలో జరిగిన అల్లర్లు నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా ఉంచడంతో ఇటు జేసీ, అటు పెద్దారెడ్డి వర్గీయులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడా తమ యాక్టివిటీస్ బయటకు రాకుండా ఇన్నర్ పాలిటిక్స్ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పెద్దారెడ్డి అడుగులు వేస్తుంటే..జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అన్ని చోట్లా అభ్యర్థులను నిలిపి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
టిడిపి నేతలతో మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసిన జేసీ కుటుంబం అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని గ్రామాల్లో పోటీ ఉండేలా చూస్తున్నారు. రెబల్స్ బెడద లేకుండా అన్ని చోట్ల సింగిల్ అభ్యర్థిని బరిలో నిలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి వైసీపీ నేతలు ఎక్కడా ఏకగ్రీవం చేసుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు మాత్రం రెండు వర్గాలపై ఒక కన్నేసి ఉంచారు.
ఇటు పెద్డారెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌నే పంచాయతీ ఎన్నికల్లోనూ చూపించాలని పట్టుదలతో ఉన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా…వీటిలో పెద్దవడుగూరు, యాడికి మండలాలు వైసీపీకి బలంగా ఉన్నాయి. ఇక తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం 85 పంచాయతీల్లో సింహ భాగం గెలుచుకునేలా పెద్దారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. జేసీకి ధీటుగా సమావేశాలు నిర్వహిస్తూ..టీడీపీ నేతలను తమ వైపుకు తిప్పుకునేలా ప్యూహలకు పదును పెడుతున్నారు.
ఇటీవల తాడిపత్రిలో జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. సుమారు పది రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పంచాయతీ ఎన్నికలు రావడంతో..ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇప్పటికే ఇరు వర్గాలపై నిఘా ఉంచారు. నామినేషన్ల అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలో వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.