మీ శరీరంలో విటమిన్ డి తగినంత ఉందా..? లేదని భావిస్తే.. వెంటనే విటమిన్ డి పెంచుకునే యత్నం చేయండి. ఎందుకంటే విటమిన్ డికి, కరోనాకు దగ్గరి సంబంధం ఉందని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. కోవిడ్ నెగెటివ్ వచ్చిన వారితో పోలిస్తే పాజిటివ్ వచ్చిన వారిలోనే విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నాయని తేల్చారు. విటమిన్ డి తక్కువగా ఉంటే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అందువల్ల విటమిన్ డి స్థాయిలను పెంచుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన ల్యూమిట్ హెల్త్ సైన్సెస్ (ఎల్‌హెచ్ఎస్), బార్-ఇలాన్ యూనివర్సిటీకి చెందిన అజ్రియెలి మెడిసిన్ ఫ్యాకల్టీ పరిశోధకులు తాజాగా పరిశోధనలు చేపట్టారు. మొత్తం 7807 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించి వారిలో విటమిన్ డి స్థాయిలను పరీక్షించారు. వారిలో 782 మందికి కోవిడ్ 19 సోకగా.. వారిలో ఇతరుల కన్నా విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నాయని తేల్చారు. అందువల్ల విటమిన్ డి స్థాయిలను పెంచుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. విటమిన్ డి తగినంత ఉంటే కోవిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, అలాగే ఒక వేళ కోవిడ్ సోకినా.. ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయని అంటున్నారు. అందువల్ల విటమిన్ డి ఉన్న ఆహారాలను తినాలని వారు చెబుతున్నారు.
కాగా సైంటిస్టులు చేసిన సదరు పరిశోధనలకు చెందిన వివరాలను ఎఫ్ఈబీఎస్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. ఇక నిత్యం ఉదయాన్నే 30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండడం వల్ల మన శరీరం దానంతట అదే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అలాగే చేపలు, కోడిగుడ్లు, పుట్టగొడుగులు, పాలు, పాల సంబంధ ఉత్పత్తులు తినడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి స్థాయిలు సరిగ్గా ఉంటే ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.