హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎల్లుండి టీఆర్‌ఎస్‌లో రమణ చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ఎల్ రమణ.. శుక్రవారం టీడీపీ రాజీనామా చేశారు. ఇక టీఆర్ఎస్‌లో ఎల్ రమణ చేరిక లాంఛనమైంది. మంత్రి ఎర్రబెల్లి ద్వారా సీఎం కేసీఆర్ సమక్షంలో కారు పార్టీలో చేరనున్నారు. అంతేకాదు టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయనున్నారు.
ఇక హుజురాబాద్ బరిలో ఎల్ రమణను దింపాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే ఎల్ రమణను టీఆర్ఎస్‌లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లికి చెప్పారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి స్వయంగా ఎల్ రమణను కలిసి టీఆర్ఎస్‌లో చేరాలని కోరారు. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ అంత యాక్టివ్‌గా లేకపోడంతో టీఆర్ఎస్‌లో చేరేందుకు ఎల్ రమణ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ రమణ బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత. హుజూరాబాద్‌లో ఈటలను తట్టుకోవాలంటే ఎల్ రమణ అయితే కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారు.