టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఆస్తులు పెరిగాయే తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల ఆదాయం మాత్రం పెరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మధుయాష్కీ ప్రసంగిస్తూ.. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఒక్కసారి గాంధీ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రజాసేవలో భాగంగా ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ సభ్యుడైన రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు యాష్కీ.
దేశంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు భాయి భాయి అని.. తెలంగాణలో ఆ రెండూ పార్టీలే ఒకటేనని అన్నారు ఆయన . బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్‌లో ఉన్నా.. అరెస్ట్ చేయలేని స్నేహం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది అని యధుయాష్కీ హేళన చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన అమలవుతుందన్నారు యాష్కీ. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం.. కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు. అమరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించారని, రైతులను రైతు బంధు అంటూ బందిపోటు దొంగలా వ్యవహారిస్తున్న కేసీఆర్‌ను తాము బొందపెడతామని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.