మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బోధన హిందీలో నిర్వహించే దేశంలోనే మొట్టమొదటి రాష్ర్టంగా మధ్యప్రదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే… మధ్యప్రదేశ్ లో మొత్తం 13 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు (అక్టోబరు 16) భోపాల్ లో జరిగే ఓ కార్యక్రమంలో హిందీలోకి అనువదించిన ఎంబీబీఎస్ ఫస్టియర్ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఎంబీబీఎస్ విద్యాబోధన ఓ ఆంగ్లేతర భాషలో బోధించనుండడం దేశంలో ఇదే మొదటిసారి.
కాగా, ఈ అంశంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ, వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల విద్యా బోధన హిందీలో సాధ్యం కాదని, విద్యార్థులు నేర్చుకోలేరని భావించే వారు ఇక అభిప్రాయాలను మార్చుకోక తప్పదని అన్నారు. హిందీ మాధ్యమంలో చదువుకుని కూడా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడం సాధ్యమేనని నిరూపించడంలో ఇది తొలి అడుగు అని వివరించారు. విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిలాష అని పేర్కొన్నారు.