మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్..ఎవరి సత్తా ఎంతంటే…!

-

మహేశ్వరం నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ వైవిధ్యంగా ఉంటుంది. నియోజకవర్గం అంతా ఒక చోట ఉంటే.. ఈ రెండు డివిజన్లు మాత్రం గ్రేటర్లోకి వచ్చాయి. ఉన్న ఈ రెండు డివిజన్లలో రాజకీయం రంజుగా ఉంది. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నాయకులకు ఇక్కడ గెలుపు ఓ సవాల్ గా మారింది.

గ్రేటర్ హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం మహేశ్వరం . ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవి రెండే డివిజన్లు. ఒకటి RK పురం, రెండోది సరూర్ నగర్. జీహెచ్ఎంసీ ఏర్పాటుకు ముందు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాలు మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో రెండు డివిజన్లుగా మహేశ్వరం అసెంబ్లీ పరిధిలోకి వెళ్లాయి.

ఈ రెండు డివిజన్లలో ఇతర ప్రాంతాల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. నల్గొండ, పాలమూరు జిల్లా వాసులు అధికం. ఈ రెండు డివిజన్లలో బీసీలు ఎక్కువగా ఉంటారు. గెలుపోటములను ప్రభావితం చేసే సామాజిక వర్గం కూడా ఇదే. మైనార్టీల ఓట్లు కూడా కీలకంగానే ఉంటాయి. ఆర్కే పురంలో బ్రాహ్మణులు, వైశ్యులు పెద్దసంఖ్యలోనే ఉంటారు. ఇక్కడ బీజేపీకి కొంత అనుకూల ఓటు బ్యాంకు ఉంది. ఇక సరూర్‌నగర్లో బీసీ ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ కొంత అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రభావం కనిపిస్తోంది.

2009లో జరిగిన RK పురం, సరూర్ నగర్ డివిజన్లకు జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2016లో జరిగిన ఎన్నికల్లో RK పురం డివిజన్‌ను బీజేపీ గెలుచుకోగా… సరూర్‌నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. సిట్టింగ్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక దుబ్బాక గెలుపుతో జోష్ మీద ఉన్న బీజేపీ… గ్రేటర్లోని ఈ రెండు డివిజన్ల మీద కన్నేసింది. RK పురం సిట్టింగ్ స్థానం కావడంతో బీజేపీ ఈ డివిజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే సరూర్‌నగర్‌లో పాగాకు ప్లాన్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా తమ వంతుగా పోటీచేస్తోంది. రెండు డివిజన్లలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అంతగా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు.

సరూర్‌నగర్ డివిజన్లో రోడ్లపై డ్రైనేజీ పారుతుంది. మురుగు నీరుతో కలిసి మంచినీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోడ్లన్నీ గోతులమయం. సరూర్‌నగర్ చెరువును ఆనుకుని ఉన్న కాలనీల్లో వర్షం వచ్చిందంటే వరద సమస్య. డ్రైనేజీ నిండినా తీయరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక RK పురం అంతా కమర్షియల్ ఏరియా. అందులో అక్కడక్కడ ఎన్నో ఆశలతో పేదలు నివసిస్తుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌నగర్లో పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళే. ఇక్కడ కనీస వసతుల కూడా లేవు. డ్రైనేజీలు ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. చెత్తంతా రోడ్ల మీదే ఉంటుంది. పారిశుద్ధ్యం గురించి పట్టుంచుకునే వారే ఉండరని స్థానికులు అంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడి కాలనీలో పర్యటించి సమస్యకి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీ అమలుకు నోచుకోలేదని… ఆవేదనతో ఉన్నారు కాలనీ వాసులు.

మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారు. ఈ డివిజన్లలో విజయం మంత్రి సబితకు ప్రతిష్టాత్మకం. మరి ప్రజలు ఎలా తీర్పిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news