ఈడీ సమన్లపై ఖర్గే ఫైర్‌.. గోయల్‌ సెటైర్‌..!

-

రాజ్యసభలో గురువారం అధికార, విపక్ష ఎంపీల మధ్య వాడీవేడీ మాటల యుద్ధం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనకు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం తమ గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఇదిలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం బతికుంటుందా? అని మండిపడ్డారు. అయితే ఖర్గే వ్యాఖ్యలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ దీటుగా బదులిచ్చారు. ఈడీ విధుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

గురువారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత.. ప్రతిపక్ష నేతలపై ఈడీ చర్యలు, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నివాసాల వద్ద పోలీసుల ఘెరావ్‌ అంశాన్ని కాంగ్రెస్‌ లేవనెత్తింది. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే కేంద్రంపై ధ్వజమెత్తారు.

‘‘గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు నేను ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంది. నేను చట్టాన్ని అనుసరిస్తాను. కానీ, ఇప్పుడు సభా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేతగా నేను చర్చల్లో పాల్గొనాల్సిన అవసరముంది. ఇలా పార్లమెంట్ సమావేశాల మధ్యలో నాకు సమన్లు జారీ చేయడం సరైందేనా? నిన్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నివాసాలను పోలీసులు నిర్బంధించారు. ఇదిలానే కొనసాగితే మన ప్రజాస్వామ్యం బతుకుతుందా? రాజ్యాంగానుసారం మేం విధులు నిర్వహించగలమా? మమ్మల్ని కించపర్చేందుకే, మా గళాన్ని అణచివేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు(ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ). కానీ మేం భయపడం. పోరాడుతాం’’ అని ఖర్గే అన్నారు.

అయితే, ఖర్గే వ్యాఖ్యలకు రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘దర్యాప్తు సంస్థల విధుల్లో కేంద్రం ఏవిధంగానూ జోక్యం చేసుకోదు. బహుశా.. వాళ్లు(కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అధికారంలో ఉన్నప్పుడు అలా జరిగిందేమో..! ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు నిరాధారం. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉంది. కాంగ్రెస్‌ నేతలు తప్పించుకోవడం మాని.. చట్టాన్ని ఎదుర్కొవాల్సిందే’’ అని గోయల్ దీటుగా బదులిచ్చారు. ఈ చర్చ అనంతరం ఖర్గే ఈడీ ఎదుట హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news