రాష్ట్ర ప్రజల జీవనం అతలాకుతలమైంది : మల్లు రవి

-

హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. వారికి రూ.10,000 ఆర్ధిక సాయం చేయాలనే డిమాండ్‌తో గన్‌పార్క్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయం ముందు బైఠాయించి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే గన్‌పార్క్ నుంచి కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి తదితరులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్ర ప్రజల జీవనం అతలాకుతలం అయిందని, అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేనట్లే వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. వరద ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. వరదల వల్ల కాలనీలన్నీ చెరువులుగా మారాయని తెలిపారు. సర్వం కోల్పోయి కొందరు తిండికి లేక అల్లాడుతున్నారని అన్నారు. కేవలం సెక్రటేరియట్, ప్రగతి భవన్‌లు బావుంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొంగులేటి వరద బాధితులకు ఆహారం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారని, అలాగే కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version