సెల్ఫీ.. ఇప్పుడు యువతలో దీనిపై ఉన్న పిచ్చి మరేదానిపైనా లేదు.. చెరువులో సెల్ఫీ. బస్సులో సెల్ఫీ.. ఇంట్లో అద్దం ముందు సెల్ఫీ, లవర్ తో సెల్ఫీ.. ఇలా సెల్ఫీ దిగడం.. అలా సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. ఇదీ వరుస. ఈ సెల్ఫీల కోసం ఇటీవల ప్రాణాల మీదకు తెచ్చుకున్న చాలామంది గురించి పత్రికల్లో చదివాం.
కానీ కర్ణాటకలో ఓ కుర్రాడు మాత్రం సెల్ఫీ కోసం కక్కుర్తి పడి జైలుపాలు అయ్యాడు. అసలు విషయం ఏంటంటే.. కర్ణాటకలోని చారిత్రక నగరమైన హంపీ విజయనగర సామ్రాజ్య కళా, సాహితీ సౌరభాన్ని కళ్లకుగట్టే నిలయం. హంపీని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది యునెస్కో.
అక్కడి పురాతన కట్టడాలకు ముప్పు కలిగించడం నేరం.. అలాంటి చోట సెల్ఫీ కోసం ప్రయత్నించాడు నాగరాజు అనే కుర్రాడు. పురాతన కట్టడాలపై చేయి వేసి ఫొటోలు దిగాడు.. ఆ సమయంలో రెండు పురాతన స్తంభాలు అకస్మాతుగా కూలిపోయాయి. ఇంకేమంది.. అక్కడి నిర్వహాకులు అతడిపై పోలీసు కేసు పెట్టారు.
దీంతో స్థానిక పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. అతడిపై ఏకంగా 1958నాటి పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడికి 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తరవాత ఏ శిక్ష వేస్తుందో తెలియదు.. సెల్ఫీ మోజుతో జైలుపాలై చింతిస్తున్నాడు నాగరాజు.. ఉరఫ్ సెల్ఫీరాజు.