మన నేతల నోటి నుంచి వచ్చే మాట మరెక్కడో సూటిపెడుతోంది. ఎవరి పదవికో ఎసరు పెడుతుంది. అందుకే కాబోలు.. ఏ మాట వెనుక ఏ మర్మం దాగి ఉందో తెలుసుకోవడం అంత సులభమేమీ కాదు. ఇక్కడ స్విచ్‌వేస్తే.. మరెక్కడో లైట్ వెలిగినట్టు.. నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు అగ్రనేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వర్సెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నటి నుంచో అంతర్గతంగా ఉన్న ఈ వార్ హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ విషయంలో ఒక్కసారిగా బయటపడింది.
లోలోపల ఎంత ఆధిపత్య పోరు ఉన్నా..ఎన్నడూ బయటకు మాట్లాడని రేవంత్ రెడ్డి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ మాటల్లో ఆంతర్యం ఏమిటన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో సాధించిన సీట్ల సంఖ్యకే పరిమితం అయింది. ఆ ఎన్నికల్లో కోడంగల్‌లో రేవంత్‌రెడ్డి కూడా ఓడిపోయారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఇక కోదాడ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి కూడా ఓడిపోయారు.
ఆ తర్వాత ఉత్తమ్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మూడు నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి ఉత్తమ్, మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌రెడ్డిలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఇదిలా ఉండగా.. ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదని, ఆయనను తప్పించాలని పలువురు నాయకులు బహిరంగంగానే మాట్లాడారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. హజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో తన భార్య పద్మావతి పోటీ చేస్తుందని ఉత్తమ్ ప్రకటించడంపై రేవంత్ ఫైర్ అయ్యారు. ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో తన అభ్యర్థి కిరణ్‌రెడ్డి అని ఉత్తమ్‌కు పోటీగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో అంతర్గత కలహాలబయటపడ్డాయి. అయితే.. హజూర్‌నగర్ ఉత్తమ్ సొంత నియోజకవర్గమని, అక్కడ అభ్యర్థి విషయంలో ఆయనకే ఛాన్స్ ఉంటుందని పలువురు నాయకులు అంటున్నారు.
కనీసం జిల్లాతో ఎలాంటి సంబంధం లేని రేవంత్ తన అభ్యర్థిని ప్రకటించడంపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. హుజూర్‌నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. అది ఉత్తమ్ వైఫల్యంగా ఉంటుందని, దానితో ఆయనను టీపీసీసీ చీఫ్‌గా తొలగిస్తే…తనకు అవకాశం ఉంటుందని, అందుకే పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు రేవంత్ ఇలా ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు నాయకులు గుసగులాడుకుంటున్నారు.