బంగీ జంప్ – అతి ప్రమాదకరమైన దూకుడు. ఎత్తైన ప్రదేశం నుండి కాళ్లకు తాడు కట్టుకుని కిందకు దూకడమే ఈ బంగీ జంప్. అయితే ఈ తాడుకు రబ్బర్ లాగా సాగే గుణం ఉండటం వలన కిందిదాకా వెళ్లాక మళ్లీ పైకి లాగేస్తుంది. ఒకవేళ తాడు తెగితే… ఇంతేసంగతులు. అదే జరిగింది ఇక్కడ.
బంగీ జంప్ చేయాలని చూసిన ఒక వ్యక్తి, తాడు తెగడంతో కింద పడ్డాడు. దాదాపు 330 ఆడుగుల ఎత్తైన ప్లాట్‌ఫాం నుండి దూకిన వ్యక్తి నడుముకు, కాళ్లకు ఉన్న జీను తెగిపోవడంతో చాలా ఎత్తు నుండి కింద పడ్డాడు. పోలండ్‌లోని గ్డినియాలో జరిగిన ఈ ఒళ్లు జలదరించే సంఘటనలో అతను ప్రాణాలతో బయట పడటం పెద్ద ఊరట.
ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు షాక్ గురై పెద్దపెట్టున కేకలు పెట్టారు. పరుగుపరుగన తన వద్దకు చేరుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒక క్రేన్ ద్వారా 330 అడుగల ఎత్తుకు చేరుకున్న ప్లాట్‌ఫారం పైనున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి అక్కడినుండి కిందకు దూకాడు. కొంతదూరం కిందికి వచ్చాక, హఠాత్తుగా అతని శరీరానికి కట్టిన జీను, పైనున్న తాడుకు మధ్యలో తెగిపోవడంతో, అదే వేగంతో కిందనున్న ఎయిర్‌బ్యాగ్‌పై పడ్డాడు. దాంతో భీతావహులైన ప్రేక్షకులు అరుచుకుంటూ అతనివైపు దూసుకెళ్లారు. అప్పటికి అతను కూడా నొప్పితో భయంకరంగా కేకలు పెడుతుండగా, అక్కడ ఉన్న అధికారులు వెంటనే అసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనలో అతని వెన్నెముక విరిగిపోయింది. అంతర్గత అవయవాలకు దెబ్బతగిలిందని స్థానిక పోలీసు అధికారి తెలియజేసాడు. వెన్నెముక విరిగినా, అదృష్టవశాత్తు వెన్నుపాముకు ఏమీ కాకపోవడంతో అతనికేమీ ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.
ఈ బంగీజంప్‌కు బాధ్యత వహించిన కంపెనీ, అక్కడ ఎప్పట్నుంచో బంగీజంప్‌లు నిర్వహిస్తోంది. తమ ఉపకరణాలు, సామాగ్రి అంతా అత్యంత సురక్షితమైనవనీ, అతను ఎలా కిందపడ్డాడో తమకు ఇంకా అర్థం కావడంలేదని ఆ కంపెనీ ప్రతినిధి వాపోయాడు. అతనికైతే ఏ ప్రమాదమూ జరగకపోవడం పెద్ద రిలీఫని ఆయన వ్యాఖ్యానించాడు.