కూతురి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసి డబ్బు మొత్తాన్ని కేరళ బాధితులకు ఇచ్చేశాడతను..!

-

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత విధంగా వర్షాలు కురుస్తుండడంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. కేరళ రాష్ట్రంలో ఉన్న దాదాపు అనేక ప్రాంతాలకు ఇతర రాష్ర్టాలతో సంబంధాలు తెగిపోయాయి. వర్షాలకు ఇప్పటి వరకు 324 మంది మృతి చెందగా, 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

1924వ సంవత్సరం తరువాత మళ్లీ ఇప్పుడే కేరళలో ఆ స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో కేరళలో 37 శాతం వర్షపాతం అధికంగా నమోదైంది. ఇక ఆ రాష్ట్రంలో ఇప్పటికే 1500 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే యావత్ దేశ ప్రజానీకం ఇప్పుడు కేరళ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

దేశంలో ఉన్న పలు రాష్ర్టాలకు చెందిన సీఎంలతోపాటు ప్రధాని మోడీ, పలువురు సెలబ్రిటీలు, సామాన్య పౌరులు కేరళకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కాగా కేరళలోని కూత్తుకుళంలో ఇవాళ మనోజ్ అనే జర్నలిస్టు కుమార్తె నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కానీ దాన్ని మనోజ్ వాయిదావేశారు. తమ కుటుంబ సభ్యలతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నారు. సదరు నిశ్చితార్థానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మనోజ్ పంపారు. మనోజ్ ట్రివేండ్రంకు చెందిన ఓ జర్నలిస్టు. తమ రాష్ర్టానికి చెందిన వరద బాధితులకు సహాయం చేయడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోజ్ తెలిపారు. మనోజ్ ఈ పనిచేసినందుకు ఆయన్ను నిజంగా అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news