పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్ వేళ విధుల నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. తమ వాహనాన్ని అడ్డుకున్నారనే కోపంతో ఓ పోలీసు చేతిని నరికివేశారు. మరో ఇద్దరు పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం గాయపడ్డ పోలీసులకు ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు.
‘సిక్కు వర్గానికి చెందిన నిహంగ్స్ ఈ దాడికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ వేళ విధులు నిర్వరిస్తున్న పోలీసులు వాహనంలో కూరగాయల మార్కెట్ మీదుగా వెళ్తున్న సమయంలో వారిని ఆపి ప్రశ్నించారు. కర్ఫ్యూ పాసులు చూపించాలని వారిని కోరారు. దీంతో వారు పోలీసు బారికేడ్లను వాహనంతో ఢీ కొట్టారు. అనంతరం కత్తులతో పోలీసులపై దాడికి దిగారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చేతిని కత్తితో నరికారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు’ అని పోలీసు ఉన్నతాధికారి మన్‌దీప్ సింగ్ సిద్ధు తెలిపారు.
కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యేలా చూసేందుకు, కరోనా వ్యాప్తిని నిరోధించడానికి పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులకు హాజరవుతున్నారు. అలాంటి పోలీసులపై కొన్ని చోట్ల ఇటువంటి దాడులు జరగడం కలకలం రేపుతోంది.