కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్.. రెండింటిలో ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నా సరే కొన్ని వారాలకు శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. దీంతో కోవిడ్ నుంచి మనకు రక్షణ లభిస్తుంది. అయితే లక్నోలో ఓ వ్యక్తి కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై ఫిర్యాదు చేశాడు. తాను కోవిషీల్డ్ డోసును తీసుకున్నప్పటికీ తనలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని తెలిపాడు. సీరమ్ సంస్థతోపాటు మరికొందరిపై అతను ఫిర్యాదు చేశాడు.
లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సీరమ్ సంస్థతోపాటు డీసీజీఏ డైరెక్టర్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయలపై ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు ప్రతాప్ చంద్ర మాట్లాడుతూ తాను ఏప్రిల్ 8వ తేదీన కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్నానని 28 రోజుల తరువాత రెండో డోసు తీసుకోవాల్సి ఉందని, కానీ రెండో డోసుకు గడువును 6 వారాల పాటు పెంచారని తెలిపాడు. తరువాత ఆ విరామాన్ని ప్రభుత్వం 12 వారాలకు పెంచిందన్నాడు.
కోవిడ్ మొదటి డోసు తీసుకున్న తరువాత తాను అస్వస్థతకు గురయ్యాయనని, అయితే కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తరువాత యాంటీ బాడీలు తగిన స్థాయిలో ఉత్పత్తి అవుతాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మీడియాకు చెప్పారని, అందుకనే తాను ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో యాంటీ బాడీ జీటీ టెస్టు కూడా చేయించుకున్నానని తెలిపాడు. అయితే యాంటీ బాడీలు తన శరీరంలో ఉత్పత్తి కాలేదని టెస్టు రిపోర్టులో చెప్పారని అన్నాడు. అంతేకాక తన శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3 లక్షల నుంచి 1.50 లక్షలకు తగ్గిందని తెలిపాడు. అందువల్లే తాను వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
అయితే పోలీసులు అతను ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేశారు. కానీ ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది చాలా సున్నితమైన అంశమని, అందువల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తాను కోర్టుకు వెళతానని బాధితుడు హెచ్చరించాడు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.