విద్యాభ్యాసానికి నిజంగా వయస్సుతో పనిలేదు. ఎవరైనా.. ఏ వయస్సులోనైనా.. ఏమైనా చదవవచ్చు. డిగ్రీ పట్టాలను పొందవచ్చు. ఆసక్తి ఉండాలే గానీ వృద్ధాప్యంలోనూ ఏ డిగ్రీనైనా సాధించవచ్చు.
విద్యాభ్యాసానికి నిజంగా వయస్సుతో పనిలేదు. ఎవరైనా.. ఏ వయస్సులోనైనా.. ఏమైనా చదవవచ్చు. డిగ్రీ పట్టాలను పొందవచ్చు. ఆసక్తి ఉండాలే గానీ వృద్ధాప్యంలోనూ ఏ డిగ్రీనైనా సాధించవచ్చు. అవును, సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మాడు కనుకనే.. ఆ వృద్ధుడు 83 ఏళ్ల వయస్సులోనూ ఇంగ్లిష్‌లో పీజీ డిగ్రీ పట్టా పొందాడు. ఈ క్రమంలో ఆ తాత చదువుకోవాలనుకునే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ గ్రామానికి చెందిన సోహన్ సింగ్ గిల్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ల కిందట అక్కడి మహిల్‌పుర్‌లోని ఓ కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాడు. అయితే అప్పట్లో వివాహం చేసుకోవడం, కెన్యాకు వెళ్లడం వల్ల అతనికి మళ్లీ పీజీ చేసే అవకాశం రాలేదు. కానీ చాలా ఏళ్ల తరువాత భారత్‌కు వచ్చిన అతనికి ఎలాగైనా పీజీ చేయాలనిపించింది. అందుకనే 2018లో అతను అక్కడి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌లో చేరాడు. ఈ క్రమంలోనే తాజాగా అతను ఆ కోర్సు పూర్తి చేసి ఎంచక్కా పీజీ పట్టా పొందాడు.
అయితే ఈ వయస్సులో పీజీ ఎందుకు చేయాల్సి వచ్చిందని సోహన్ సింగ్ గిల్‌ను ప్రశ్నించగా, అందుకు అతను సమాధానమిస్తూ.. అప్పట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినప్పుడు ఆ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ తనను చదువు ఆపవద్దని, కొనసాగించమని చెప్పాడని, కానీ అప్పుడది సాధ్యం కాకపోవడంతో.. ఇప్పుడు ఆయన కోరిక మేరకు పీజీ చేశానని చెప్పాడు. ఈ క్రమంలోనే సోహన్ సింగ్ పట్టుదలను ఇప్పుడందరూ ప్రశంసిస్తున్నారు. చదువుకోవాలనే తపన ఉండే ప్రతి ఒక్కరికీ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు..!