తెలంగాణ, ఆంధ్రా.. 2005 నుంచి 2014.. ఆ తర్వాత కూడా ఈ రెండు ప్రాంత నాయకుల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తొలినాళ్లలోనూ.. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య కూడా విభజన సమయంలో చాలా వాగ్వాదాలు జరిగాయి.. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. తెలుగు జాతి మనది.. రెండుగ వెలుగు జాతి మనది అన్నట్టుగా ఉంది నేటి పరిస్థితి.
ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ స్నేహితుల్లా వ్యవహరిస్తుండటం వల్ల.. ఈ రెండు రాష్ట్రాలు కలసి ముందుకెళ్లే ఆలోచనలు చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ.. ఈ పోలీసుల శిక్షణ.. తాజాగా ఆదివారం జరిగిన కేసీఆర్, జగన్ భేటీలో.. విద్యుత్, పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నారు. అందులో 4వేల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణనివ్వాలని కేసిఆర్ ఏపి ముఖ్యమంత్రిని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకే సారి శిక్షణనివ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు తెలంగాణకు కలుగుతుంది.
గోదావరి జలాలను ఉమ్మడిగా వినియోగించుకునే అవకాశాలపైనా సీఎంలు మాట్లాడుకున్నారు.వీలైనంత తక్కువ భూసేకరతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా తరలించాలి, అలైన్ మెంట్ ఎలా వుండాలి? అనే విషయాలు చర్చించారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా వుండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం వుండాలని కేసీఆర్, జగన్ నిర్ణయించారు. దీనికోసం రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే అంటారు కలసి ఉంటే.. కలదు సుఖం అని.