హర్యానా ఆసుపత్రిలో సోమవారం ఒక సాంకేతిక నిపుణుడు నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చిపెట్టింది. ఎంఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన ఆ వ్యక్తిని.. ఎంఆర్ఐ మిషన్‌లోకి పంపించి చివరకు గమనింపకుండా వదిలేయడంతో ఊపిరాడక నానా ఇబ్బందులు పడుతూ ప్రాణాలను రక్షించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. లోహన్(59) అనే వ్యక్తి బైక్‌పై నుంచి పడిపోవడంతో అతని భుజం ఎముక పక్కకు జరిగింది.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 22 న ఎంఆర్ఐ స్కాన్ కోసం పంచకుల సివిల్ ఆసుపత్రిని సంప్రదించాడు. అక్కడ వైద్యుడు లలిత్ కౌషల్, లోహన్‌కు 10 నుంచి 15 నిమిషాలపాటు అందులోనే ఉండాలని చెప్పడంతో.. అతడు అలాగే చేశాడు. కానీ అరగంట గడిచినప్పటికీ అతడిని బయటకు తీయకపోవడంతో ఊపిరాడక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అదే విధంగా అతడు ఎంత అరిచినా.. ఏడ్చినా ఎవరు పట్టించుకోలేదని లోహన్ మీడియాకు చెప్పారు.
అలాగే బయటకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బెల్టులతో కట్టడంతో వీలు కాలేదని.. చివరి ప్రయత్నంలో బెల్ట్ విరగడంతో తాను బయట పడ్డానని లేకపోతే అక్కడే చనిపోయేవాడినని మీడియాకు ఆరోపించాడు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లోహన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇదిలా ఉంటే ఎంఆర్‌ఐ సెంటర్ ఇన్‌ఛార్జి అమిత్ ఖోఖర్ దీనిపై స్పందిస్తూ.. తాము అతడ్ని 20 నిమిషాలపాటు మెషీన్‌లో ఉండమన్నామని తెలిపారు.
అదే విధంగా అతడ్ని మెషీన్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సాయం చేశామని కూడా తెలిపుతూ లోహన్ పేర్కొన్న ఆరోపణలను ఖండించారు. అయితే లోహన్ ఏ మాత్రం తగ్గకుండా.. కావాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.