కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి తినడానికి తిండి లభించడం లేదు. కొందరికైతే అవసరం అయిన మందులను తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల రవాణా సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. ఓ తండ్రి తన కొడుకును బతికించుకునేందుకు ఏకంగా 3 రోజుల పాటు శ్రమించి 300 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి మందులను తెచ్చాడు. ఈ సంఘటన అందరినీ విచారానికి గురి చేస్తోంది.
కర్ణాటకలోని మైసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గనిగనకొప్పాలు అనే గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి 10 ఏళ్ల వయస్సు కలిగిన కుమారుడు ఉన్నాడు. అతనికి 6 నెలల వయస్సు ఉన్నప్పుడు అరుదైన వ్యాధి వచ్చింది. దీంతో రోజూ మెడిసిన్‌ను వాడాలని చెప్పారు. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా అతనికి 18 ఏళ్లు వచ్చే వరకు మెడిసిన్‌ను వాడితే అతను కోలుకుని అందరిలా మారే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆనంద్ ఎంతో కష్టపడుతూ తన కుమారుడికి క్రమం తప్పకుండా మందులను అందిస్తూ వస్తున్నాడు. వాటిని బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ అందిస్తుంది.
అయితే మరో 3 రోజుల్లో తన కుమారుడికి ఇవ్వాల్సిన మెడిసిన్లు అయిపోతాయి. కనుక బెంగళూరుకు వెళ్లి అక్కడి ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ లో మందులను తెచ్చుకోవాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల రవాణా సదుపాయం లేదు. దీంతో అంతదూరం వెళ్లేందుకు అతను బంధువులు, స్నేహితులను టూవీలర్ ఇవ్వమని కోరాడు. లాక్‌డౌన్ కదా, బయట కనిపిస్తే వాహనం సీజ్ చేస్తారన్న భయంతో ఎవరూ ఆనంద్‌కు వాహనం ఇవ్వలేదు. దీంతో ఆనంద్ సైకిల్‌పై ప్రయాణించాడు. 140 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి మందులను తీసుకుని మళ్లీ అంతే దూరం సైకిల్ తొక్కి ఇంటికి వచ్చాడు. తన కుమారుడికి మందులను అందజేశాడు. ఇందుకు అతనికి 3 రోజుల సమయం పట్టింది. సైకిల్ మీద అంత కష్టపడి వెళ్లినందుకు ఫలితం దక్కింది. తన కుమారుడికి ఇవ్వాల్సిన మెడిసిన్ డోసు మిస్ కాలేదు. దీంతో అతను ఊపిరిపీల్చుకున్నాడు. ఈ సంఘటన అందరినీ విచారానికి గురి చేస్తోంది.