మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో దారుణం జరిగింది. పదమూడేళ్ళ దళిత బాలిక మీద అత్యాచారం చేసి సజీవంగా పాతి పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 35 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. గోతిలో పాతి పెట్టడంతో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బాలికను పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాగ్పూర్ ఆసుపత్రికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఘోదడోంగ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రానికి మోటారును ఆపివేయడానికి బాలిక ఒంటరిగా వెళ్లిన క్రమంలో నిందితుడు ఆమె మీద అత్యాచారం చేశాడని బేతుల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిమల ప్రసాద్ తెలిపారు.
నేరాన్ని దాచడానికి, నిందితుడు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కాలువ వద్దకు లాగి, సమీపంలోని ఒక గొయ్యిలో పడేశాడు, అనంతరం అతను రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఆ గోతిని కప్పడానికి యత్నించాడు. అమ్మాయి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాక పోవడంతో ఆమె తల్లిదండ్రులు మరియు సోదరి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఆమె సోదరి గొయ్యి దగ్గరకు చేరుకున్నప్పుడు, బాధతో మూలుగుతున్న గొంతు వినిపించింది. ఆమె వెంటనే తన తండ్రిని పిలిచింది, వారు పొదలు రాళ్లను తొలగించినప్పుడు అందులో బాధితురాలు కనిపించింది.