ఒక ఎస్ఐ తనను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అవుకు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మీద భారత రాష్ట్రపతికి గురు ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అవుకు మండలం చేర్లోపల్లి గ్రామానికి చెందిన గురు ప్రసాద్ తనకి సంబంధం లేని విషయాల్లో ఎస్ఐ అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు.
తనపై అక్రమ కేసులు నమోదు చేసిన సమయంలో తాను కర్ణాటకలోని బెంగళూరు రూరల్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నానని, అయితే ఆ సమయంలో తన స్వగ్రామమైన చెర్లోపల్లిలో జరిగిన ఘటనకి తనను నిందితుడిగా చేర్చడం సరైనది కాదని ఆయన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా కూడా తనకు న్యాయం జరగలేదని అందుకే మీకు లేఖ రాస్తున్నానని అయన పేర్కొన్నాడు.