సీఎం రేవంత్ సర్కారుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. చేయూత పింఛన్ దారులను రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. చేయూత పింఛన్ దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని మందకృష్ణ మాదిగ తెలిపారు. చేయూత పింఛన్ దారులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఆ పార్టీని గెలిపిస్తే పింఛన్ దారుల్ని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకూ పింఛన్లను ఎందుకు పెంచలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కంటే చంద్రబాబే చాలా బెటర్ అని మందకృష్ణ తెలిపారు. ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చామని, జూన్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. మూడు నెలలవి కలిపి జూలైలో ఇచ్చారని గుర్తుచేశారు.ఏపీలో కండరాల క్షీణత ఉన్నవారికి ప్రతినెలా రూ.15 వేలు పింఛన్ ఇస్తున్నట్లు వివరించారు.వచ్చేనెల తొలివారంలో రాష్ట్ర సర్కార్ అర్హులైన పింఛన్ దారులకు 10 నెలల బకాయిలను కలిపి ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.