లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నోటీసులపై రియాక్ట్ అయ్యారు. ఇవాళ సీబీఐ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడంపై ఆయన స్పందించారు. తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని సిసోదియా సీబీఐను కోరారు. దిల్లీ బడ్జెట్ ఖరారు చేసే పనిలో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరుకాలేనని.. అందుకే కాస్త సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.
‘బడ్జెట్‌ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా నా కర్తవ్యం. ఇది చాలా కీలకమైన ప్రక్రియ. దీని కోసం 24 గంటలు పని చేస్తున్నా. బడ్జెట్‌ను ఖరారు చేస్తున్న నేపథ్యంలో.. సమయం కావాలని సీబీఐకి లేఖ రాశా. ఫిబ్రవరి చివరి వారం తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరా’ అని సిసోదియా మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దాఖలు చేసిన ప్రమాణపత్రాల్లో సిసోదియాను నిందితునిగా పేర్కోనప్పటికీ.. ఈ స్కామ్లో ఆయన పాత్రపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని సీబీఐ ఇది వరకు వెల్లడించింది.