అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడి లేదా మరణించి ఉంటారని సమాచారం. బుధవారం సాయంత్రం ప్రార్థన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎంత మంది చనిపోయారో చెప్పలేమని అక్కడి పోలీసులు పేర్కొన్నారు.
సుమారు 35 మంది గాయపడి లేదా మరణించి ఉంటారని ఒక తాలిబన్ ఇంటెలిజెన్స్ అధికారి పేర్కొన్నాడు. 20 మంది చనిపోయి ఉంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 27 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరారని స్థానిక ఎమర్జెన్సీ ఆసుపత్రి ట్విటర్‌లో పేర్కొంది. వీరిలో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపింది.
కాబుల్ ఉత్తరప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు, సమీపంలోని భవనాలు కిటికీలు పగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చనిపోయిన వారిలో మసీదు ఇమామ్ కూడా ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.