శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మళ్లీ తిరిగి ఆ దేశానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో తలదాచుకుంటున్న ఆయన వచ్చే వారం అంటే ఆగస్టు 24న శ్రీలంకకు తిరిగి వస్తారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారితో ఆయన ఫోన్ లో మాట్లాడారని తెలిపారు.
2006 నుంచి 2015 వరకు రష్యాలో శ్రీలంక రాయబారిగా పనిచేసిన వీరతుంగ.. గొటబాయ రాజపక్స ఇక రాజకీయ పదవుల కోసం మళ్లీ ఎన్నిక కాబోరన్నారు. గతంలో మాదిరిగానే దేశానికి ఆయన కొంత సేవ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దేశం విడిచి తొలుత మాల్దీవులకు వెళ్లిన గొటబాయ ఆ తర్వాత సింగపూర్‌కి.. అక్కడి నుంచి నేరుగా ఛార్టర్డ్ విమానంలో బ్యాంకాక్ (థాయిలాండ్) చేరుకొని అక్కడే ఓ హోటల్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.
అయితే, భద్రత కారణాల రీత్యా లోపలే ఉండాలని, బయటకు రావొద్దని అక్కడి పోలీసులు గొటబాయకు స్పష్టం చేశారు. థాయిలాండ్‌లో ఉన్నంతకాలం అదే హోటల్‌లో ఉండొచ్చని అధికారులు ఆయనకు చెప్పినట్లు బ్యాంకాక్ పోస్ట్ పత్రిక ఇటీవల తన కథనంలో పేర్కొంది. సింగపూర్‌లో తన వీసా గడువు తీరిపోయిన రోజునే గొటబాయ బ్యాంకాక్‌కు చేరుకున్నారు. మరో దేశంలో శాశ్వతంగా ఆశ్రయం పొందేవరకు (దాదాపు నవంబర్ వరకు) ఆయన థాయిలాండ్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వచ్చేవారమే స్వదేశానికి తిరిగి వచ్చేయాలనుకోవడం గమనార్హం.