ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ప్రమాణాలు ఉన్న వాహనాలు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఆ తేదీ నుంచి కేవలం ఆ ప్రమాణాలు ఉన్న వాహనాలనే రిజిస్టర్ చేస్తారు. బీఎస్-4 ప్రమాణాలు ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరు. కనుక కొత్తగా బీఎస్-4 వాహనాలను కొన్నవారు మార్చి 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయా రాష్ట్రాల రవాణా మంత్రిత్వ శాఖలు వాహనదారులను హెచ్చరిస్తున్నాయి.
ప్రస్తుతం బీఎస్-4 ప్రమాణాలు ఉన్న వాహనాలు డీలర్ల వద్ద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు భారీ డిస్కౌంట్లను ప్రకటించి పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తగ్గింపు ధరలకు వస్తున్నాయని చెప్పి కొందరు వినియోగదారులు వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మార్చి 31వ తేదీ దాటితే బీఎస్-4 ప్రమాణాలు ఉన్న వాహనాలు రిజిస్టర్ కావనే విషయం గుర్తుంచుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దాదాపు చాలా వరకు ఆర్‌టీఏ ఆఫీసులలో వాహనాల రిజిస్ట్రేషన్ల స్లాట్లను రెండు రెట్ల వరకు పెంచారు. రద్దీని తట్టుకునేందుకు ఆ ఏర్పాటు చేశామని ఆర్‌టీఏ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఎవరైనా సరే.. బీఎస్-4 వాహనాన్ని కొత్తగా కొనుగోలు చేస్తే మార్చి 31వ తేదీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ అని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..!