తెలంగాణా రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక నేత నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా తండ్రి కెసిఆర్ కు, అన్న కేటిఆర్ కి అన్ని విధాలుగా ఆమె సహాయ సహకారాలు అందించారు. నిజామాబాద్ ఎంపీగా పని చేయడమే కాకుండా… ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఎంపిక అయ్యారు ఆమె. అయితే గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో…
కవిత నిజామాబాద్ నుంచి ఓడిపోయిన తర్వాత… కాస్త రాజకీయాల నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఆమె మళ్ళీ పార్టీలో చక్రం ఎప్పుడు తిప్పుతారా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. ఇక ఈ నేపధ్యంలోనే కెసిఆర్ కవితకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. రాజకీయంగా కవిత ప్రతిభ ఉన్న నాయకురాలు. ఆమెను మంత్రి వర్గంలో చేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది అని పలువురు సూచించారు.
అయితే కవిత మాత్రం మంత్రి పదవి మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే వార్తలు వచ్చాయి. దీనితో ఆమెను ఎమ్మెల్సీగా పంపిస్తారని కూడా అన్నారు. కాని కవిత మాత్రం… తాను ఏ పదవి చేపట్టినా ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే చేపడతాను గాని ఇలా ఎంపిక అవ్వను అని కెసిఆర్ కి చెప్పారట. కెసిఆర్ కూడా ఆమెకు అదే సూచన చేసినట్టు సమాచారం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని,
మహా అయితే నాలుగు ఏళ్ళు సమయం వృధా అవుతుంది గాని పెద్ద నష్టం ఏమీ లేదని, ఈ నాలుగేళ్ళు ప్రజల్లో ఉంటే ఇమేజ్ మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుందని కెసిఆర్ కూడా ఆమెకు సూచనలు చేసినట్టు సమాచారం. దీనికి కవిత కూడా ఓకే చెప్పారని అంటున్నారు. అందుకే ఆమెను రాజ్యసభకు గాని, ఎమ్మెల్సీ పదవికి గాని ఎంపిక చేసే ప్రయత్నం కెసిఆర్ చేయడం లేదని తెరాస వర్గాలు అంటున్నాయి.