ఔరంగాబాద్ లో “తెలంగాణ మోడల్” గురించి పెద్దఎత్తున ప్రచారం

-

“తెలంగాణ మోడల్” గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పథకాలను వివరించే 7 వీడియో స్క్రీన్ ప్రచారరధాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) జిల్లా పరిధిలో గల ఔరంగబాద్ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్, వైజాపూర్, కన్నాడ్, గంగాపూర్, కొలంబర్ తదితర అన్ని నియోజకవర్గాల్లో ప్రచార రథాల ద్వారా అన్ని గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామన్నారు.

తెలంగాణ రూపురేఖలు మార్చిన 450 స్కీముల విశిష్టత గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేలా అన్ని గ్రామాలకు ప్రచార రధాలు పంపుతున్నామన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణ రైతులకు స్వర్ణయుగమన్నారు.”తొమ్మిది విడతలలో రైతుబంధు పథకం కింద 62 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.80వేల కోట్లు బదిలీ అయ్యాయి. రూ.40వేల కోట్ల వ్యయంతో వ్యవసాయ రంగానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. రైతులకు రూ.17,351 కోట్ల రుణమాఫీ జరిగింది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రూ.లక్ష 19 వేల కోట్లతో 660.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. రూ.5 వేల కోట్లతో రైతుభీమా పథకం అమలు జరుగుతోంది.

ఇప్పటి వరకు 94,002 మందికి రూ.4700.10 కోట్ల పరిహారం అందింది. రూ.లక్షన్నర కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా చేస్తున్నారు. రూ.40 వేల కోట్లతో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ చేసి కొత్త ఆయకట్టుకు ప్రాణం పోసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది. రూ.572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. రూ.963 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులకు యంత్రాలు సమకూర్చారు. రూ.928.68 కోట్లతో రాయితీపై విత్తనాల సరఫరా జరుగుతోంది. రూ.2108.45 కోట్ల సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలను పంపిణీ చేశారు.

ఒక్కొక్క విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు వెచ్చిస్తూ రాష్ట్రంలో 1153 గురుకుల పాఠశాలలు, కళాశాలలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా రూ.1,00,116 చొప్పున ఇచ్చి కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు జరిపించిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిది.
రూ.3 వేల విలువ చేసే కేసీఆర్ కిట్లను దాదాపు 14 లక్షల మందికి పంపిణీ చేశారు.
ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను ప్రభుత్వం ఇస్తున్నది.
ప్రతి నెలా 50 లక్షల మందికి రూ.2016 నుండి రూ.3016 ఆసరా ఫించన్ల పంపిణీ జరుగుతోంది.
రూ. 40 వేల కోట్లతో మిషన్ భగీరధ పథకంతో ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీళ్ల సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

కిశోర బాలికలకు హెల్త్ కిట్లు, అన్ని రంగాల ఉద్యోగులకు జీతాల పెంపు, పీఆర్సీ వర్తింపు, నెల, నెలా జీతాల చెల్లింపు, వందకు పైగా డయాలసిస్ సెంటర్ల ఏర్పాట్లు, నూతన ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, రోడ్లు, భవనాలు, వంతెనలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి లెక్కలేనన్ని కార్యక్రమాలు తొమ్మిదేళ్ల తెలంగాణ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వచ్చిన మార్పులు” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో సాధ్యమైన ఈ పథకాల అమలు మహారాష్ట్రలో సాధ్యం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ,కాంగ్రెస్ లవి ఓట్లు, సీట్ల రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు ఆ పార్టీలకు పట్టవని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ది అభివృద్ధి, సంక్షేమ విజన్ గా ఆయన అభివర్ణించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నేత కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 24వ్ తేదీన జరగనున్న ఔరంగబాద్ సభలో కేసీఆర్ ద్వారా తెలంగాణ స్కీముల నివేదన జరుగుతుందన్నారు. పల్లెలన్నీ గులాబీ మయం కావాలని ఆయన కోరారు. పల్లెలన్నీ కదిలి ఔరంగబాద్ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news