ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ జరగనున్న విషయం విదితమే. ఈ పూజకు ప్రధాని మోదీ హాజరై వెండి ఇటుకతో శంకుస్థాపన చేస్తారు. అయితే సదరు పూజ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల పండిట్ ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ముహూర్తం పెట్టారు. ఈయన బెల్గావిలో ఉంటారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన సభ్యుల్లో ఒకరైన స్వామి గోవింద్ దేవ్ గిరిజికి శర్మ అత్యంత సన్నిహతులు. అందువల్లే శర్మ ఆ భూమి పూజకు ముహూర్తం పెట్టారు.
కాగా ఫిబ్రవరిలోనే శర్మను నిర్వాహకులు భూమి పూజ కార్యక్రమానికి ముహూర్తం పెట్టమని అడిగారు. దీంతో శర్మ అప్పట్లో ఏప్రిల్‌లో అక్షయ తృతీయ నాడు శంకుస్థాపనకు ముహూర్తం పెట్టారు. కానీ కరోనా లాక్‌డౌన్ వల్ల కార్యక్రమం వాయిదా పడింది. దీంతో మరోసారి శర్మ ముహూర్తం పెట్టారు.
జూలై 29, 31, ఆగస్టు 1, 5 తేదీల్లో శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఆ 4 తేదీలను శర్మ నిర్వాహకులకు తెలిపారు. ఈ క్రమంలో మోదీ షెడ్యూల్ మేరకు ఆగస్టు 5ను భూమి పూజకు కేటాయించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పూజ చేయాల్సి ఉంటుంది. తరువాత రాహు కాలం వస్తుందని శర్మ తెలిపారు.
కాగా శర్మ గతంలో ప్రముఖ రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పారు. మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలు శర్మ సలహాలు తీసుకునేవారు. వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణం చేసినప్పుడు శర్మే స్వయంగా అందుకు ముహూర్తం పెట్టారు. విజయేంద్ర శర్మకు మొత్తం 8 భాషలు తెలుసు. ఈయన బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌గా గోల్డ్ మెడల్ అందుకున్నారు. తరువాత వారణాసిలో కొన్నాళ్లు ఉన్నారు. అనంతరం గోపాలచార్య గురూజీ వద్ద శిష్యరికం చేస్తూ దేశమంతటా శర్మ పర్యటించారు.